శనివారం, సెప్టెంబర్ 26, 2009, 14:58 [IST]
భూమా నాగిరెడ్డి దంపతులు ఇంకా అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. రోజా లాంటి పరిస్ధితే వీరిది. మరో ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమవుతుండగా, రాజశేఖరరెడ్డి హఠాన్మరణం చెందడం సినిమా కథ అక్కడితో ఆగిపోయింది. అయినా నిన్న భూమా దంపతులు నల్వకాల్వ వద్ద జగన్ కు స్వాగతం పలికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించడం ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి మండుకొచ్చినట్టు చెబుతున్నారు. ఎన్నికల ముందు భూమా దంపతులు ప్రజారాజ్యంలో చేరారు. భర్త ఎంపీగా, భార్య ఎమ్మెల్యేగా టికెట్లు తెచ్చుకుని పోటీ చేశారు. భార్య శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొనలేకపోతున్నారు. పార్టీలో "బంధువుల" ప్రమేయం ఆమెకు నచ్చడం లేదని చెబుతున్నారు.
ఇంత ఓపెన్ గా భూమా దంపతులు కాంగ్రెస్ కు ముఖ్యంగా జగన్ కు మద్దతు తెలిపినా వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోడానికి చిరంజీవి వెనుకాడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వారిపై చర్య తీసుకుంటే కర్నూలు జిల్లాలో సగభాగం ప్రజారాజ్యానికి వ్యతిరేకమవుతుందని ఆయనకు తెలుసు. కాగల కార్యం గంధర్వులే చేస్తారని, తాను మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉండదలచుకున్నానని చిరంజీవి సంకేతాలు ఇస్తున్నారు.