గురువరం, ఆగస్ట్ 20, 2009, 11:57 [IST]
హైదరాబాద్: మంత్రుల వ్యాఖ్యలపై గురువారం శాసనసభలో తీవ్ర రభస జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆదర్శ రైతులపై చర్చ సందర్భంగా ఈ గందరగోళం చెలరేగింది. సభ అప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఆదర్శ రైతుల ఎంపికపై కాంగ్రెసు సభ్యుడు వెంకటేశ్వర రెడ్డి వేసిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ప్రశ్నలు వేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు స్పీకర్ ను కోరారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అందుకు నిరాకరించారు. దాంతో తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ సమయంలో సభా కార్యక్రమాలు స్తంభించాయి. స్పీకర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు వినలేదు.
తెలుగుదేశం సభ్యులపై మంత్రి రఘువీరా రెడ్డి న్యూసెన్స్ గాళ్లంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నోర్మూసుకోండని మరో మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రులపై చర్య తీసుకోవాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. గతంలో ఏమీ వ్యాఖ్య చేయకుండానే తమ సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావును సభ నుంచి సస్పెండ్ చేశారని, ఇప్పుడు తమపై వ్యాఖ్యలు చేసిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారని తెలుగుదేశం సభ్యుడు అశోక గజపతిరాజు అన్నారు. మంత్రులపై చర్యలు తీసుకునే ధైర్యం స్పీకర్ కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.