సోమవారం, నవంబర్ 2, 2009, 18:57 [IST]
హైదరాబాద్: బలహీనపడింది కాబట్టే కాంగ్రెసు పార్టీ చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని జరిగిన అభివృద్ధి అంతా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెసు పార్టీ అంతర్గత వివాదాల వల్ల బలహీనపడిందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్ గౌడ్ అన్నారు. అంతర్గత తగాదాల కారణంగానే కాంగ్రెసు ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీని ఓడించే సత్తా లేకనే కాంగ్రెసు ప్రజారాజ్యంతో జత కట్టిందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీకి ప్రజాదరణ లేదని ఆయన అన్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యాఖ్యలను కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఖండించారు. కాంగ్రెసు పార్టీ బలహీన పడలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు జాతీయ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, వ్యక్తులతో ముడిపడిన పార్టీ కాదని ఆయన హితవు పలికారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమ పార్టీ పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తును తమ పార్టీ అధిష్టానం ఖరారు చేసిందని చెప్పారు. దాన్ని ప్రశ్నించకుండా అంగీకరించాలని ఆయన కోరారు. వైయస్ మరణం తర్వాత కూడా పార్టీ బలంగనే ఉందని, వైయస్ మరణించిన తర్వాత కూడా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయం సాధించిందని ఆయన అన్నారు.